Monday, January 2, 2012

కొత్త యాడాది... పాత జ్ఞాపకాలు...

రేపు కొత్త సంవత్సరం అంటే ఇయ్యాల రాత్రి ఫుల్ బిజీ. నోట్ బుక్స్ ల నుంచి జోడి పేపర్లు చింపి పాకెట్లు తయారు జెయ్యాలె. వాటి మీద దోస్తుల పేర్లు రాయాలె. ఇష్టమయిన సార్ల కోసం పెద్ద పెద్ద పాకెట్లు జేశోటోల్లం. ఈ పాకెట్ల లొల్లి ఏంది అనుకుంటున్నారా? చెప్తా. ఆ పేపర్ పాకెట్స్ మీద "నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని రాసి, అందులో బిస్కిట్లు, చాక్లెట్లు పెట్టి దోస్తులకు, సార్లకు ఇచ్చెటోల్లం. కొందరు బిస్కిట్లు ఏమి కొనకుండా, వాళ్ళకి ఒచ్చిన బిస్కిట్లనే వేరే పాకెట్లల్ల పెట్టి పంచెటొల్లు. ఇంకా, ఆడోళ్ళందరూ పొద్దుగాల్ల ముగ్గులెయ్యడానికి రంగులు, సుద్ద తయారు జేస్కునెటొల్లు. పొద్దుగాల్ల ఇంకా ఎలుగు రాకముందే లేచి ముగ్గులు స్టార్ట్ జేశోటోల్లు. కట్టెపుల్ల తోని ఆకిట్ల నేను "WEL COME" "HAPPY NEW YEAR" రాస్తే, మా అక్కలు దాంట్లో రంగులు ఏశేటోల్లు. తెల్లారినంక మంచిగా రెడీ అయిపోయి రాత్రి తయారు జేస్కున్న పాకెట్లు పంచే పని స్టార్ట్ జేశోటోల్లం. ఆ తర్వాత, తినాలె, బాల్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లకు పోయి మల్ల ఆకలయ్యేదాకా కిర్కేట్ అడాలె. గదీ కొత్త సంవత్సరం అంటే.